త్వరలోనే పీఆర్‌‌సీపై సానుకూల నిర్ణయం..ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి పొంగులేటి

త్వరలోనే పీఆర్‌‌సీపై సానుకూల నిర్ణయం..ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువగా, పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు క్షేత్రస్థాయి ఉద్యోగుల అనుభవం, సహకారం ఎంతో కీలకమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వంలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు ఉండబోవని తేల్చిచెప్పారు.

ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు మంజూరు చేశామని, ఉద్యోగ సంఘాలు ఎంతోకాలంగా కోరుతున్న పీఆర్‌‌సీ అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులతో చర్చించి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రైసా) వ్యవస్థాపక అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి పదవీ విరమణ సన్మాన సభ  జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రెవెన్యూలో సంస్కరణలు అంటే కేవలం కొందరు ఉన్నతాధికారులు, మంత్రుల ఆలోచనలతో మాత్రమే సాధ్యం కావని, గ్రామం నుంచి మండల స్థాయి వరకు పనిచేసే ఉద్యోగుల భాగస్వామ్యంతోనే మార్పు వస్తుందని చెప్పారు.ఉద్యోగులను తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తున్న ప్రజా ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం సానుకూలంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై త్వరలోనే ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి ప్రత్యేకంగా సమావేశమై సమగ్రంగా చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారంజగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, శ్యామ్,  ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ట్రైసా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎల్. రామన్ రెడ్డి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విక్టర్, చంద్రకళ పాల్గొన్నారు.